
తమ్ముడిని చంపిన అన్నకు ఏడేళ్ల జైలు
పెంటపాడు: ఆస్తితగాదాల నేపథ్యంలో తమ్ముడిని హత్య చేసిన అన్నకు తాడేపల్లిగూడెం ఏడీజే కోర్టు న్యాయమూర్తి షేక్ సికిందర్ ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. పెంటపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుతీగపాడు ఎస్సీకాలనీకి చెందిన చిన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు (28) అన్నదమ్ములు. వీరు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్‌లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఆస్తితగాదాలు ఉండేవి. ఈ క్రమంలో 2024 జనవరి 9న అన్నదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగడం, అన్న చిన్నం శ్రీనివాస్ తమ్ముడైన వెంకటేశ్వర్లుపై కత్తితోదాడి చేశాడు. ఈ దాడిలో వెంకటేశ్వర్లుకు మెడపై బలమైన గాయం కావడంతో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అప్పటి ఎస్సై హరికృష్ణ హత్యకేసుగా నమోదు చేశారు. అనంతరం గూడెం డీఎస్పీ విశ్వనాథ్, గ్రామీణ సీఐ రమేష్ పర్యవేక్షణలో ఎస్సై స్వామి, ఏఎస్సై యు.రాజేందర్ పీపీ శివరామకృష్ణ కోర్టులో వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో సోమవారం గూడెం కోర్టు ముద్దాయి శ్రీనివాస్‌కు ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై స్వామి తెలిపారు.
హస్తకళా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్
నరసాపురం రూరల్: హస్తకళా ఉత్పత్తులన్నీ మనసు దోచుకునేలా ఉన్నాయని, నరసాపురం ప్రాంతంలో హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్‌పో నిర్వహించడం మన ప్రాంతానికి గర్వకారణమని జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం నరసాపురం మండలంలోని రుస్తుంబాద గ్రామంలో అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం మార్కెటింగ్ ఉందన్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 70 హస్తకళా ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం, అమ్మకాలు సాగించడం ద్వారా వాటి గురించి మరింత ప్రాచుర్యం జరుగుతుందన్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించని వారు మంగళవారం చివరిరోజున అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మన ప్రాంత లేసు అల్లికలు, కళంకారి, కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, ఉప్పాడ చీరలు, బొబ్బిలి వీణలు ఇలా ఎన్నో హస్తకళలు ఉన్నాయన్నారు. ఈయన వెంట ఈపీసీహెచ్ సదరన్ రీజియన్ కోఆర్డినేటర్ కలవకొలను తులసి ఉన్నారు.