
రికవరీ ఏజెన్సీల మాఫియా?
తీగలాగితే డొంక కదిలింది
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలోని ఒక సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుకు ఫోన్ కాల్ వచ్చింది. తాను ఏలూరు నుంచి సీఐ నాగరాజును మాట్లాడుతున్నానని.. చింతలపూడిలోని ఒక వ్యక్తికి చెందిన ఆధార్, పాన్‌కార్డ్ అతని పూర్తి వివరాలు వాట్సప్‌లో ఇవ్వాలని చెప్పాడు. ఆమెకు అనుమానం రావడంతో ఏలూరులోని పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తీగ లాగితే.. మొత్తం డొంక కదిలింది. ఏలూరు శాంతినగర్‌లో థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో ఒక కార్యాలయాన్ని నడుపుతున్న ముఠా దొరికింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు త్రీటౌన్ పోలీసులు కార్యాలయంపై మూడు రోజుల క్రితం దాడి చేశారు. పత్తేబాద రోడ్డులోనూ ఇదే తరహా ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేటు ఏజెన్సీ మాఫియా
ఫైనాన్స్ కంపెనీలు రుణాల రికవరీకి థర్డ్‌పార్టీ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏలూరు కేంద్రంగా ప్రైవేటు ఏజెన్సీ మాఫియా జనాలను పోలీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఏజెన్సీలో ఏలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు, తిరుపతికి చెందిన ఇద్దరు, బెంగుళూరుకు చెందిన మరో ఇద్దరు కీలక పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన గడ్డం కిషోర్ అలియాస్ నాగరాజు, మధ్యాహ్నపు వంశీకృష్ణ, ప్రవీణ్‌కుమార్, రియాజ్, వెంకట్, ఇబ్రహీం, మరో నలుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏజెన్సీ ముఠాలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత సమాచారం?
ప్రైవేటు ఏజెన్సీల పేరుతో సాగుతున్న దందాతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల పేరుతో ఏకంగా సచివాలయ ఉద్యోగులను సైతం ప్రభావితం చేస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చూస్తే .. వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నకిలీ పోలీసులే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా ? లేక నిజంగానే ఎవరైనా పోలీస్ అధికారులు ఈ ఏజెన్సీలకు అండగా నిలుస్తున్నారా? అనేది సందేహంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రైవేటు ఏజెన్సీల ఆగడాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు.
దుగ్గిరాల ప్రాంతానికి చెందిన కలగంటి గోవింద్ కొంతకాలం క్రితం ప్రైవేటు ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. ఇటీవల అతనికి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు అతడిని కలిసి నీకు బీమా వస్తుంది.. కొంత కడితే ఇంక లోన్ కట్టాల్సిన పనిలేదని కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం థర్డ్‌పార్టీ ఏజెన్సీ పేరుతో సీఐ అంటూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలని, రూ.1.80 లక్షలు చెల్లించకుంటే చెక్‌బౌన్స్ కేసు నమోదు చేస్తామని, అల్లరి చేస్తామని, బెయిల్ కూడా రాదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఏలూరు టౌన్: ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన రామసీత ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పర్సనల్ లోన్ తీసుకున్నారు. నాలుగేళ్లుగా కడుతూ ఉండగా ఆరు నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో బకాయి పడింది. రామసీతకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అమరావతి నుంచి సీఐను మాట్లాడుతున్నాను. మీపై హైకోర్టులో కేసు వేస్తున్నారు. మీ ఇంటికి గంటలో పోలీసు జీపు వస్తుంది. మిమ్మల్ని చెక్‌బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ బెదిరించారు. కొంతసేపటి తర్వాత పత్తేబాద సచివాలయానికి చెందిన ఒక మహిళా పోలీసు (మహిళా సంరక్షణ కార్యదర్శి) రామసీత ఇంటికి వచ్చి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారని.. మీపై చెక్‌బౌన్స్ కేసు పెట్టారని.. వెంటనే సంబంధిత ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుని బకాయి డబ్బులు కట్టకపోతే.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
పోలీసుల పేరుతో భయభ్రాంతులు
సచివాలయ సిబ్బందిని
వినియోగిస్త్తున్న వైనం
ఏలూరులో రెండు చోట్ల తాత్కాలిక ఆఫీసులు?
9 మందిపై కేసు నమోదు