
గంగానమ్మ విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత
నూజివీడు : పట్టణంలోని కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్‌లో రావి చె ట్టు వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాలను శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో యడవల్లి రవిచంద్ర(32) అనే అతను గునపంతో తవ్వి ధ్వంసం చేసి పక్కన పడేశాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న దేవుడి ఫొటోలను సైతం పక్కన పడేశాడు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి యడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది తమ సొంత స్థలమని, అందులో ఎవరెవరో వచ్చి విగ్రహాలు పెట్టి తాము ఏర్పాటు చేసిన గుడి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అసలు తమ పట్టా భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి తవ్వినట్లు రవిచంద్ర విచారణలో తెలిపాడని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఇప్పటివరకు ఎక్కడైతే గంగానమ్మ విగ్రహం ఉందో మళ్లీ అక్కడే విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.