ఏలూరు టౌన్: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం బలిదానం చేసి పొట్టి శ్రీరాములు అమరజీవిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ప్రకాశం రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే తపనతో ఆనాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టారన్నారు. ప్రభుత్వాలు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, సీనియర్ నాయకులు గంటా మోహన్‌రావు, యూత్ అధ్యక్షుడు సాయి ప్రదీప్, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, జిల్లా కార్యదర్శి జనార్దన్, రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ గాజుల బాజీ, ఆర్‌టీఏ విభాగం అధ్యక్షుడు మద్దాల ఫణి, డాక్టర్ వింగ్ అధ్యక్షుడు కొవ్వాడ దుర్గారావు, యువజన నాయకులు బండ్లమూడి సునీల్‌కుమార్, శంకర్, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు