
భీమవరంలో మూర్తిరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం
ఆకివీడు: ప్రశ్నించండి, నిలదీయండి అని రెండు చేతులెత్తి ప్రసంగాలిచ్చే జనసేన నేత పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నించే తత్వం చచ్చిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.లోక్‌నాథం విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న రాష్ట్ర బస్సు యాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చేరుకుంది. స్థానిక వెంకయ్య వయ్యేరు వంతెన వద్ద నుంచి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ సెంటర్‌లో జరిగిన సభలో లోక్‌నాథం మాట్లాడుతూ రెండు చేతులూ ఎత్తి ఊగిపోతూ ప్రసంగాలిచ్చే పవన్ ఒక చెయ్యిని టీడీపీకి, మరొకటి బీజేపీకి ఇచ్చేశారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దేశాన్ని అథోగతిపాలు చేసిందని విమర్శించారు. అంబానీ, అదానీ అంటూ మోదీ నిరంతరం జపం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ మండల కార్యదర్శి కె.తవిటినాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి బలరామ్, జేఎన్‌వీ గోపాలన్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత న్యాయ సాయంపై అవగాహన కల్పించాలి
సాక్షి, భీమవరం: న్యాయ విద్యనభ్యసించే విద్యార్థులు న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమైన లోక్ అదాలత్, ఉచిత న్యాయ సాయం, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా కక్షిదారులకు కలిగే ఉపయోగాలను గ్రామాల్లో వివరించాలని భీమవరం సీనియర్ సివిల్ జడ్జి బి.అప్పలస్వామి అన్నారు. భీమవరం డీఎన్నార్ లా కళాశాలలో గురువారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. 2022 నవంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు నిర్వహించిన 4 జాతీయ లోక్ అదాలత్‌లు, 2 ప్రత్యేక లోక్ అదాలత్‌ల ద్వారా 619 క్రిమినల్ కేసులు, 155 సివిల్ కేసులు, 145 ప్రి లిటిగేషన్ కేసులు, 2450 బెంచ్ కోర్టు కేసులు రాజీ చేశామని 6 కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించగా 73 న్యాయ విజ్ఞాన సదస్సులు, 50 గ్రామాలలో పారా లీగల్ వలంటీర్ల ద్వారా లోక్ అదాలత్ గురించి ప్రచారం నిర్వహించినట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.రఘురాం, బార్ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్‌బాబు, డీఎస్పీ జీవి పైడేశ్వరారావు, భీమవరం టుటౌన్ సీఐ జి.శ్రీనివాస్, కళాశాల కో ఆర్డినేటర్ ఎం కృష్ణం రాజు, కళాశాల ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా ఆర్‌ఆర్‌డీఎస్ కళాశాల స్వర్ణోత్సవాలు
సాక్షి, భీమవరం: భీమవరం పట్టణంలోని ఆర్‌ఆర్‌డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుక, రాజారామ్‌మోహన్‌రాయ్ ద్విశత జయంతోత్సవాలు గురువారం సందడిగా సాగాయి. వక్తల ప్రసంగాలు, విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ వీకెజె ప్రసూన మాట్లాడుతూ ఆర్‌ఆర్‌డీఎస్ కళాశాలను ఏర్పాటుచేసిన విద్యా దాత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. మూర్తి రాజు డెల్టా ప్రాంతంలో 68 విద్యా సంస్థలను నెలకొల్పి విద్యా ప్రగతికి బాటలు వేశారని కొనియాడారు. ఈ సందర్భంగా రాజారామ్‌మోహన్ ద్విశత జయంత్యోత్సవాల సావనీరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు, రామప్రసాద్, సూర్యనారాయణ, డాక్టర్ సుందరరావు, సత్యనారాయణ రాజు, వంశీకృష్ణ రాజు, హనుమాన్ గుప్తా, డీవీఎస్ చంద్రాజీ, డేవిడ్ లివింగ్ స్టన్ పాల్గొన్నారు.

డీఎన్నార్ లా కళాశాలలో ప్రశంసా పత్రాలు అందిస్తున్న జడ్జి అప్పలస్వామి