ప్రమాదాలు జరుగుతున్నా..
ప్రణాళికలు రుపొందించాం
సంగెం : మండలంలోని వరంగల్–మహబూబా బాద్ ప్రధాన రహదారి అధ్వానంగా తయారు కావడంతో మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారిపై అడుగడుడునా గుంతలు ఏర్పడ్డాయి. కంకర తేలింది. రోడ్డుపైకి ఇరువైపులా పిచ్చిమొక్కలు చొచ్చుకువచ్చి వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రహదారి నిర్వహణలో ఆర్ అండ్ బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలంలోని కాపుల కనిపర్తి, ఆశాలపల్లి, గవిచర్ల, తీగరాజుపల్లి, సోమ్లాతండా వరకు ఉన్న ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతోపాటు కంకర తేలి ప్రమాదకరంగా మారింది. గత వానాకాలంలో రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడగా మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది కురిసిన వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతిన్నది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇతర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. బీటీ లేచిపోయి గుంతలు ఏర్పడడంతో రాత్రివేళ్లల్లో ఈ దారుల్లో వెళ్లే ప్రయాణికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. గుంతల వద్ద వాహనాలు అదుపు తప్పడం, వేగాన్ని తగ్గించే క్రమంలో సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుండడంతో వెనుకాల వచ్చే వాహనాలు తగలడం పరిపాటి. ఎదురుగా వస్తున్న వాహనాలు లైట్ల వెలుతురులో కనపడక గుంతలో పలువురు పడిపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి గుంతలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సింగిల్ రోడ్డును తలపించేలా..
ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు రహదారికి ఇరు వైపులా చొచ్చుకురావడంతో పలు చోట్ల డబుల్ రోడ్డు సింగిల్ రోడ్డును తలపించేలా మారిపోయింది. రోడ్డుపై నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురౌతున్నాయి. గుంతల పూడ్చివేత, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులను అధికారులు విస్మరించారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
అడుగడుగునా గుంతలు
రోడ్డుపైకి చొచ్చుకువచ్చిన పిచ్చిమొక్కలు
నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం
రోడ్డు గుంతలమయం కావడంతోపాటు పిచ్చిమొక్కలు రోడ్డుపైకి చొచ్చుకురావడంతో రోడ్డుపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాళ్లు చేతులు విరిగి, గాయాలపాలై పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలి.
– గుళ్లపల్లి రాజు, గవిచర్ల గ్రామస్తుడు
కాపుల కనిపర్తి నుంచి సోమ్లాతండా వరకు 11.6 కిలోమీటర్లు, ఊకల్ క్రాస్ నుంచి తీగరాజుపల్లి వరకు 18 కిలోమీర్లు, తిమ్మాపూర్ నుంచి ఎల్గూర్ స్టేషన్ వరకు 5.2 కిలోమీటర్ల మేర మరమ్మతు కోసం ప్రణాళికలు రూపొందించాం. ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరు చేయగానే పనులు చేయిస్తాం.
– ప్రశాంత్‌రెడ్డి, ఏఈ, ఆర్ అండ్ బీ శాఖ


