నల్లబెల్లి : మండలంలోని మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మెనూ అమలులో నిర్లక్ష్యం నేపథ్యంలో హెచ్‌ఎం రామయ్య, డిప్యూటీ వార్డెన్ కవితకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ) నారాయణరెడ్డి శనివారం మెమో జారీ చేశారు. ‘ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాలకు తూట్లు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన సత్వరమే స్పందించారు. మెనూ సక్రమంగా అమలు చేయలేదని ప్రాథమికంగా గుర్తించి మెమో జారీ చేసినట్లు పేర్కొన్నారు. వివరణ అందిన వెంటనే నిబంధనల మేరకు తదుపరి చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేటతెల్లం చేశారు.
ప్రత్యేక పూజలు
పాలకుర్తి టౌన్: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖతో కలిసి శని వారం కోటగండి మైసమ్మ, సాయిబాబా ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి, సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఝాన్సీరెడ్డిని కొండా సురేఖ స్వామి వారి శేషవస్త్రం, చీరతో సత్కరించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
వీధి కుక్కల స్వైరవిహారం
వర్ధన్నపేట : మండలంలోని ఇల్లందలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం దుబ్బగూడెం వైపు ముగ్గురిపై దాడి చేసిన కుక్క శనివారం ఉదయం ఓ బాలుడిని గాయపర్చింది. బాలుడిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తాజాగా మరో నలుగురిపై దాడి చేయగా మొత్తం 8 మంది కుక్క కాటు బారిన పడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి. కుక్కల దాడులతో చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
నర్సంపేట రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్‌వైజర్ కార్మికుల సమస్యలు పరిష్కరించా లని ఎస్‌పీఎస్‌ఎంహెచ్‌డబ్ల్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ సుమన్ కోరారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ నుంచి సమ్మె చేపడతామని తెలుపుతూ ఆస్పత్రి సూపరింటెండెంట్ దామోదర బాయికి శనివారం సమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం ప్రదీప్, సుమన్ మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోశాధికారి నామల వంశీ, ఉపాధ్యక్షులు పద్మ, శారద, కార్యదర్శులు కల్యాణి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


