● సర్పంచ్‌ల ఆందోళన
నల్లబెల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ పింగిళి రమణారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తొలుత శాఖల వారీగా చర్చ సాగింది. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. పల్లె దవాఖానాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, నల్లబెల్లి పీహెచ్‌సీ నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లిన వైద్యాధికారి రవీందర్‌ను వెంటనే రప్పించాలని కోరారు. వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలంగా ప్రకటించే అంశాన్ని కలెక్టర్ పునరాలోచించాలని ఆకాంక్షించారు. గ్రామాల్లోని పాఠశాల సమీపంలో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులను తక్షణమే తొలగించాలని, తదితర అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సమావేశంలో తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీఓ పసరగొండ రవి, సర్పంచ్‌లు ఇస్తారి శేఖర్, నాగెల్లి జ్యోతి, పులి రమేష్, మచ్చిక రవీందర్, పల్నాటి మూర్తి, సిద్ద సంతోష్, మంద సుజాత, మాలోత్ రాంలాల్, ఎరుకల లలిత, ఓరుగంటి మాధురి, సపావట్ కవిత తదితరులు పాల్గొన్నారు.


