కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
భీమదేవరపల్లి: అర్హులైన మహిళలు, పిల్ల లు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు అందించేందుకు నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. అలింకో సంస్థ సహకారంతో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ముల్కనూరు సాయి గార్డెన్స్‌లో నిర్ధారణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. శిబిరంలో జరుగుతున్న పరీక్షల తీరును స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ముల్కనూరు సర్పంచ్ ప్రమోద్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మండల ప్రత్యేక అధికారి కమలాకర్‌రెడ్డి, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, సీడీపీఓలు స్వరూప, సింధు రాణి, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఇతర అధికారులు, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు అందజేయాలి
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనల్ని వెంటనే అందజేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి, కొత్తకొండ గ్రామాల్లో ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. చంటయ్యపల్లిలో అంగన్వాడీ, వీఓ భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలు ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రామపరిధి తండాలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏఈని ఆదేశించారు. కొత్తకొండ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. అనంతరం పల్లె దవాఖానాను పరిశీలించారు. భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, మండలంలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్, అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు భూక్య సునీత, సిద్దమల్ల రమ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఇతర అధికారులు పాల్గొన్నారు.


