● అదనపు కలెక్టర్‌కు రైతుల విన్నపం
పరకాల: ‘సన్నరకం వడ్లు అమ్ముకున్నం. ప్రభుత్వం అందించే బోనస్ అందేలా సూడుండ్రి సార్’ అని రైతులు అదనపు కలెక్టర్ రవిని కోరారు. పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని తెలుపగా.. కొందరు రైతులు ప్రభుత్వం నుంచి బోనస్ తప్పకుండా వచ్చేలా చూడాలని కోరారు. గతంలో పీఏసీఎస్ ద్వారా అమ్ముకున్న రైతులకు బోనస్ అందలేదని తెలుపగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, పరకాల పీఏ సీఎస్ సీఈఓ నాగరాజు, మార్కెట్ కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.


