హన్మకొండ: రైతాంగ, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సంయుక్త కిసాన్ మోర్చా హనుమకొండ జిల్లా కన్వీనర్ ఎన్‌రెడ్డి హంసారెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సారంపల్లి వాసుదేవరెడ్డి విమర్శించారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా హనుమకొండలోని కాళోజీ కూడలిలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను కేంద్రం అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు లాభదాయకమైన ధరలు నిర్ణయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ, కార్మిక సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లను నెరవేర్చాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమాదేవి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


