హసన్‌పర్తి: పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు సీఈఐర్ పోర్టల్‌తో గుర్తించారు. ఈమేరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌లను బుధవారం పోలీస్ కమిషనర్ శ్వేత బాధితులకు అందించారు. సీసీఎస్ ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ బృందం ప్రత్యేక చొరవతో ఫోన్ల రికవరీకి కృషి చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కానిస్టేబుల్ రాములు, జితేందర్‌ను సీపీ అభినందించారు.
హన్మకొండ అర్బన్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సువర్ణ బుధవారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటించారు. కంటి పరీక్షలు, కంటి శస్త్రచికిత్సలు, నేత్రదాన కార్యక్రమాల అమలును పరిశీలించారు. హనుమకొండలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు, దృష్టి లోపాల గుర్తింపు, కళ్లద్దాల పంపిణీపై సమీక్షించారు. సుబేదారిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ మదన్ మోహన్‌రావుతో సమావేశమయ్యారు. వరంగల్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాంతీయ కంటి ఆస్పత్రిని సందర్శించారు. కంటి పరీక్షలపై శ్రద్ధవహించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షల్లో ఆప్తాల్మిక్ అధికారి ప్రతాపగిరి ప్రసాద్, డాక్టర్ రామ్‌భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: ట్రెయినీ డీఎస్పీలు హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రెయినీ డీఎస్పీలు శాంతన్ కుమార్‌రెడ్డి, సాయి ప్రత్యూష్ రెడ్డి, సబిత, ఆంజనేయులు, యశస్విని ఉన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో బుధవారం దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మోటివ్ పవర్ ఇంజనీర్ (సీఎంపీఈ) ధర్మేందర్ కుమార్ తనిఖీ చేశారు. సీఎంపీఈ కాజీపేట జంక్షన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంప్, 1, 2వ నంబర్ ప్లా ట్‌ఫాంలు, వెయింటింగ్ హాల్స్, స్టేషన్ బయట నిర్మాణంలో ఉన్న కాజీపేట జంక్షన్ అమృత్ భారత్ స్టేషన్ ఆధునికీకరణ పనులు తనిఖీ చేసి స్థానిక అధికారులతో పలు అభివృద్ధి విషయాలపై మాట్లాడారు. సీఎంపీఈ తనిఖీలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే ఛీప్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌గోపాల్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ బబ్లురాం మీనా, డీజిల్‌షెడ్ ఏఎంఈ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
పరకాల: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిపోయిన నగదు, డాక్యుమెంట్స్‌తో కూడిన బ్యాగ్ బాధితుడికి పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్ అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. బుధవారం హనుమకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కిన నడికూడ మండలం ముస్త్యాలపల్లికి చెందిన రేషన్ డీలర్ ఆనందం మార్గమధ్యలోని పరకాల బస్టాండ్‌లో దిగిన కొద్దిసేపటికి బ్యాగ్ బస్సులోనే మరిచిపోయినట్లు గమనించాడు. స్థానిక ఆర్టీసీ అధికారులను ఆశ్రయించాడు. సంబందిత బస్సు కండక్టర్ వి.వై స్వామికి ఫోన్ చేయగా.. బస్సు సీట్లో మరిచిపోయిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. పరకాల బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారుల సమక్షంలో బాధితుడికి బ్యాగ్ అందజేశాడు. బ్యాగ్‌లో రూ.15 వేల నగదుతో పాటు విలువైన ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. నిజాయితీగా బ్యాగు అందజేసిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు, ప్రయాణికులు అభినందించారు.


