అర్హులందరికీ చేయూత పింఛన్లు
హన్మకొండ అర్బన్: సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లను మంజూరు చేసింది. జిల్లాలోని 14 మండలాల పరిధిలో 15,006 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన అనంతరం 12,149 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బుధవారం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే జిల్లాలో 96,798 మందికి పింఛన్లు అందుతుండగా, కొత్తగా మంజూరైన వాటితో కలిపి మొత్తం పింఛన్ల సంఖ్య 1,08,947కు చేరింది.
గత ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగేళ్ల పాటు కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఆ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలంలో మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేయగా.. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. ఎట్టకేలకు వివిధ వర్గాలకు చెందిన అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఐదు నియోజకవర్గాల పరిధిలో పంపిణీ
జిల్లాలోని 14 మండలాలు ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండడంతో పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు అధికారులకు సవాలుగా మారా యి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పింఛన్ల మంజూరు పత్రాలు అందించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని వేలేరు మండల కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భీమదేవరపల్లి మండలంలో నిర్వహించే కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కమలాపూర్ మండల కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, జిల్లాలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొద్ది రోజుల క్రితమే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. తాజాగా మిగిలిన ప్రాంతాల్లోనూ అధికారులు పంపిణీ చేశారు.
26 నుంచి ఖాతాల్లోకి నగదు
ప్రస్తుతం కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ ముందుగా మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ కానుందని అధికారులు చెబుతున్నారు. కొద్దిపాటి ఆలస్యం జరిగినా లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ నగదు అందుతుందని తెలిపారు.
జిల్లాలో కొత్తగా 12,149 మందికి ‘చేయూత’
1,08,947కు చేరిన పాత, కొత్త
పింఛన్ లబ్ధిదారులు
భీమదేవరపల్లి: అర్హులందరికీ చేయూత పింఛన్లు అందిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ములుకనూరులో నూతనంగా మంజూరైన 837 పింఛన్ పత్రాలను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృద్ధులు, చేనేత కార్మికుల పింఛన్ సమస్యలను పరిష్కరిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ములుకనూరు బస్టాండ్ అభివృద్ధికి రూ.1.01 కోట్లు, ఎల్కతుర్తి బస్టాండ్‌కు రూ.4 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 27న దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు జాలి ప్రమోద్ రెడ్డి, మాచర్ల కుమారస్వామి, శిఖ ప్రదీప్, కాలేరు శ్రావణ్ తదితరులు, అధికారులు తహసీల్దార్ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు.


