ఐనవోలు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండలంలోని నందనం రైతు సహకార సంఘం సొసైటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐనవోలు, వర్ధన్నపేట మండలాలు, మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ .. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లు కేవలం ఆర్ధిక సహాయం మాత్రమే కాదని, వారు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేందుకు కల్పించే భరోసా అని అన్నారు. నూతన పింఛన్ లబ్ధిదారుల లిస్టులో తమ పేరు రాకపోవడంతో పలు గ్రామాలకు చెందిన దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేయగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు వారికి సర్దిచెప్పి తరువాత జాబితాలో వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిభారాణి రాజేందర్, వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, ఐనవోలు, వర్ధన్నపేట, పట్టణ అధ్యక్షులు నకరకంటి మోహన్‌గౌడ్, పోశాల వెంకన్న, ఈగ దామోదర్, ఎంపీడీఓలు నర్మద, వెంకటరమణ పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


