ఖానాపురం: పంటల సాగులో కీటకాలు, తెగుళ్లను ప్రారంభ దశలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేవీకే మామునూరు శాస్త్రవేత్త రాజు అన్నారు. ఈ మేరకు మండలంలోని బుధరావుపేటలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటలపై ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలు అనే అంశంపై శిక్షణ, అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తేమలో మార్పుల కారణంగా ఉద్యాన పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఉద్యానశాఖ అధికారి తరుణ్ మాట్లాడుతూ పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్, ఉద్యాన పంటలకు ప్రభుత్వం 50 శాతం రాయితీలు అందింస్తుందన్నారు. పంట, రైతు వర్గాలను బట్టి డ్రిప్ ఇరిగేషన్‌కు 70 నుంచి 90 శాతం వరకు రాయితీలు అందుబాటులో ఉందన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, నర్సంపేట ఆత్మ చైర్మన్ యడ్ల భిక్షంరెడ్డి, సర్పంచ్ పెసరు రాణి, ఆయిల్‌పామ్ రైతు మండల అధ్యక్షుడు వెంకటనారాయణ, వెంకట్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


