● అదనపు కలెక్టర్ వైవీ గణేశ్
కాళోజీ సెంటర్: దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో పిల్లలను ముందుకు తీసుకెళ్లాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. శనివారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల గుర్తింపు నిర్ధారణ శిబిరం నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వివిధ మండలాల నుంచి దాదాపు 149 మంది సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థుల తమ తల్లిదండ్రులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని అర్హులైన ప్రతీ విద్యార్థికి అందేలా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రంగయ్య నాయుడు, సమ్మిళిత విద్యా జిల్లా సమన్వయకులు డాక్టర్ కట్ల శ్రీనివాస్, ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్‌కుమార్, ఎంఈఓ వెంకటయ్య, అలింకో ప్రతినిధులు డాక్టర్ ఎం.రంజిత్ రెడ్డి, అభిషేక్, రాజేందర్ తదితరలు పాల్గొన్నారు.


