చేతికి కార్డు.. అయినా సమస్యల్లో లబ్ధిదారులు
● వివరాల వ్యత్యాసాలతో ఆందోళన
● మరికొన్ని కార్డుల్లో పేరు కరెక్ట్ ఉన్నా.. డేటాలో తేడాలు
● ఈ–కేవైసీ కూడా కీలకమంటున్న సిబ్బంది
సాక్షి, వరంగల్: కొత్త స్మార్ట్ రేషన్ కార్డు చేతికొచ్చిందన్న ఆనందం కొందరు లబ్ధిదారులకు ఎంతో సేపు నిలవడం లేదు. కార్డును పరిశీలిస్తే పేరు, చిరునామా, గ్రామం, వార్డు తదితర వివరాల్లో తప్పులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికే మరణించిన వారి పేర్లు సైతం కొత్త కార్డుల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ‘చేతిలో కార్డు ఉంది.. కానీ ప్రభుత్వ డేటాలో ఏముంది?’ అన్న సందేహాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో ఇలాంటి తప్పులు వెలుగులోకి వస్తుండడంతో పౌరసరఫరా విభాగాధికారులు స్మార్ట్ రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ–కేవైసీ ముగిసినా...
ఆగస్టు 31వ తేదీతో రేషన్‌కార్డు ఈ–కేవైసీ ప్రక్రియ ముగిసేనాటికి జిల్లాలో 1,52,398 మంది ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. వీరిలో పదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఉండడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. వీరికి పాత రేషన్ కార్డు ప్రకారం స్మార్ట్ రేషన్ కార్డు ముద్రించడంతో కొన్నింట్లో తప్పులు దొర్లాయి. మొత్తంగా చూసుకుంటే స్మార్ట్ కార్డు కంటే ప్రభుత్వ డేటా బేస్‌లో వివరాల ఆధారంగానే పంపిణీ ఉంటుందని అధికారులు సమాధానమిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం స్మార్ట్ కార్డే ఆధారమంటూ ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు..
నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేట, చెన్నారావుపేట, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, గీసుకొండ, సంగెం, వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో స్మార్ట్ కార్డులు పొందిన వారిలో వందలసంఖ్యలో తప్పులు ఉన్న వారు ఉన్నారు. వీరిలో మృతి చెందినవారు, పెళ్లి చేసుకొని వెళ్లినవారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొందరు ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా స్మార్ట్ కార్డుపై పేరు సరిగా ఉన్నా టీ–రేషన్ యాప్‌లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మిగిలిన కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకునే వీలుంది. ఒకవేళ ఇందులో ఎవరి పేరైన కనిపించకపోతే స్మార్ట్ కార్డు, డిజిటల్ వివరాల్లో వ్యత్యాసం ఉన్నట్టుగా గుర్తించాలి. అనంతరం తప్పుల సవరణకు సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకునే వీలుంది. అలాగే కార్డులో మరణించిన వ్యక్తి పేరు ఉండి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా అవే వివరాలు కనిపిస్తే అధికారులు పరిశీలించి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి స్మార్ట్ కార్డులో యజమాని పేరు సరిగా ఉండటంతో మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా సరిగానే ఉంటాయన్న ఆలోచనతో మిగిలిన వారి వివరాలు తనిఖీ చేసుకోవడం లేదు. ఏది ఏమైన లబ్ధిదారులు అప్రమత్తమై కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి సవరణలు చేసుకుంటేనే మంచిదని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.
సవరణ చేసుకోవచ్చు
స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను టీ–రేషన్ యాప్‌లో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల డిజిటల్ వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో చేతిలో ఉన్న కార్డు వివరాలు, ప్రభుత్వ డిజిటల్ రికార్డులోని వివరాల మధ్య తేడాలను లబ్ధిదారులు గుర్తింస్తే సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్యూఆర్‌లో పేరు కనిపించడం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయినట్లు భావించకూడదు.
– కిష్టయ్య, జిల్లా పౌరసరఫరా విభాగాధికారి


