కొనుగోలు కేంద్రాల్లో కానరాని సదుపాయాలు
ధాన్యం కొనుగోళ్ల వివరాలు
(మెట్రిక్ టన్నుల్లో..)
ధాన్యం సేకరణ లక్ష్యం: 1,93,000
ఇప్పటివరకు కొన్నది: 37,387
మిల్లులకు తరలించినది: 34,862
మిల్లర్లు అక్‌నాలెడ్జ్‌మెంట్ ఇచ్చింది: 19,818
ఇప్పటివరకు రైతులకు చెల్లించిన మొత్తం: రూ.44.35 కోట్లు
దుగ్గొండి మండలం మందపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో గిర్నిబావిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ఆదివారం ప్రారంభమైంది. రైతులు వారం రోజుల క్రితమే ధాన్యాన్ని ఆరబోసి ఎండబోశారు. రైతులకు నీడ వసతి కోసం టెంట్ ఏర్పాటు చేశారు. అయితే, తాగేందుకు మాత్రం నీరు అందుబాటులో లేదు. అలాగే, సరిపడా టార్పాలిన్లు కూడా లేవు.
సాక్షి, వరంగల్: జిల్లాలోని 233 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘ఫస్ట్ ఎయిడ్ కిట్’ సమకూర్చాలనే డిమాండ్ ఇటు రైతులు, అటు హమాలీల నుంచి వినిపిస్తోంది. ఎండను ఓర్చుకుంటూ ధాన్యం ఆరబెట్టడం, బస్తాలు మోయడం వంటి పనుల్లో గాయాలు కావడం, వడదెబ్బ తగిలినప్పుడు తక్షణ వైద్య సహాయం అందక వారు అస్వస్థతకు గురవుతున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజు ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం ద్వారా కాస్త ఉపశమనం కలుగనుంది. వీలైతే ఏఎన్‌ఎంల సేవలను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులోకి తీసుకొస్తే తక్షణ వైద్య సహాయం అందేందుకు ఆస్కారముంటుందనే డిమాండ్ వస్తోంది.
ఆందోళనలో రైతులు
కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, షామియానాలు ఉన్నప్పటికీ మరికొన్ని కేంద్రాల్లో నీడ లేక రైతులు, హమాలీలు ఎండ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో అల్లాడుతున్నారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గాజుల పెద్ద వెంకటేశ్వర్లు (65) ధాన్యం కుప్ప వద్ద గుండెపోటుతో మరణించడంతో రైతులు, హమాలీల అవస్థలు చర్చకు వచ్చాయి. వర్షం వస్తే ధాన్యం రాశులపై కప్పేందుకు టార్పాలిన్లు, ధాన్యం నింపేందుకు గోనె సంచుల లభ్యత డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో కాంటాలు ఆలస్యమవుతోందని రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో కొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో వర్షం వస్తే ఇబ్బందులొస్తాయని, సాధ్యమైనంత తొందరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
నీడ ఉంది కానీ..
నీరు లేదు
రైతులు, హమాలీలకు వడదెబ్బ భయం
అందుబాటులో లేని ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏఎన్‌ఎం సేవలు
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి అష్టకష్టాలు
అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతి
నర్సంపేట: పంటలను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇన్ని రోజులు మక్కలు అమ్ముకోవడానికి రోజుల తరబడి కష్టపడ్డ రైతులు ఇప్పుడు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మక్కలకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2,400 ప్రకటించడంతో కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొని మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుని రెండు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు కూడా సరిపడా డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎండ వేడిమితో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి రావడంతో గుండెపోట్లకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలోని అలంకానిపేట గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు.. గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో ఆదివారం మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నిలిపింది.
నెల రోజులుగా మార్కెట్‌లో ఎదురుచూశా
నాకున్న నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో నెల రోజులుగా పడిగాపులు కాశా. తాజాగా కాంటా కాగా, బస్తాల్లో నింపా.
– పెండ్లి మోహన్, అశోక్‌నగర్


