కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్‌లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది.
ఇక్కడే తిష్ట..
ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బదిలీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
రావాలన్నా.. పోవాలన్నా భయమే!
ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికారుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్‌చార్జ్‌గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాల్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సీటీలో కూడా పనిచేశారు. అయితే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం తప్పదా?
ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్


