ఈజీఎస్ రిజిస్టర్లను సమగ్రంగా నిర్వహించాలి
● సెంట్రల్ ఆడిట్ బృందం సభ్యులు
సంగెం: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో చేపట్టుతున్న పనుల రిజిస్టర్లు, మస్టర్లను సమగ్రంగా నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సెంట్రల్ ఆడిట్ బృందం టీం లీడర్ అమిత్ శ్రీవాస్తవ్ సూచించారు. మండలంలోని మొండ్రాయి, నర్సానగర్, బీకోజీనాయక్ తండాలను గురువారం ఆడిట్ బృందం సందర్శించింది. మొండ్రాయిలో 2025–26 కాలనికి సంబంధించి రికార్డులు, నిర్మించిన సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, నర్సానగర్‌లో కూలీలు పనిచేస్తున్న పని ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మొండ్రాయిలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సానగర్‌లో కూలీల హాజరు, మస్టర్ల నిర్వహణలో మహిళా కూలీలు, పురుష కూలీలను వాస్తవ హాజరు వేయడాన్ని పరిశీలించి సంసతృప్తి వ్యక్తం చేశారు. కూలీలు పని ప్రారంభించినపుడు, 4 గంటల పని అనంతరం ముగింపు సమయంలో ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలని అలా చేస్తే హాజరు పడి కూలీలకు డబ్బులు వస్తాయన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో పనుల నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఆడిట్ బృందం సభ్యులు పారాస్ శర్మ, మోహిత్ కుమార్, డీఆర్‌డీఓ రాంరెడ్డి, పీఆర్ ఈఈ ఇజ్జగిరి, ఎంపీడీఓ రవీందర్, పీఆర్‌ఏఈ అభిరామ్, ఏపీఓ గణేష్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


