కమిషనరేట్‌లో గణతంత్ర వేడుకలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సీపీఓ భవన ప్రాంగణంలో జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చిన్నారులు, ఇతర పోలీస్ సిబ్బందికి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ కవిత, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావుతో పాటు ఏసీపీలు ఇన్‌న్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తలకిందులుగా
జాతీయ జెండా
దుగ్గొండి: పంచాయతీ అధికారుల తప్పిదం వల్ల జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన సంఘటన మండలంలోని అడవి రంగాపురం గ్రామంలో సోమవారం జరిగింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను పంచాయతీ అధికారులు సిద్ధం చేయగా, సర్పంచ్ బుర్రి రాంబాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలో జాతీయ జెండా తలకిందులుగా ఉండడంతో తప్పిదాన్ని గుర్తించిన పంచాయతీ కార్యదర్శి వంశీ, వెంటనే జెండాను కిందికి దింపి సరిచేయగా, సర్పంచ్ మళ్లీ ఎగురవేశారు. ఈ ఘటనలో పంచాయతీ సిబ్బంది తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వెండి కవచానికి జాతీయ జెండా వర్ణాలైన త్రివర్ణాలను అద్ది తెల్లజిల్లెడు పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు జరిపారు. సోమవారం వందలాది మంది దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
కార్మికుల సంక్షేమ నిధికి రూ.10లక్షలు
వరంగల్: గుమస్తా సోదరుల సంక్షేమ నిధికి రూ.10 లక్షలు అందిస్తున్నట్లు వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ చాంబర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సోమవారం ఆవిష్కరించారు. అనంతరం చెక్కును గుమస్తా సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గానికి అందించారు. చాంబర్ మాజీ అధ్యక్షులు తుమికి రమేష్‌బాబు, కటకం పెంటయ్య, చాంబర్ ఉపాధ్యక్షుడు మొగిలి చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లె సంపత్, సభ్యులు పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీల్లో శ్రుతికి ద్వితీయ బహుమతి
వరంగల్ లీగల్: జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘బాలికల హక్కులను కాపాడడం, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అంతమొందించడం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో వరంగల్ జిల్లాకు చెందిన యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థిని పొన్నం శ్రుతి పాల్గొని ద్వితీయ బహుమతి సాధించారు.
కమిషనరేట్‌లో గణతంత్ర వేడుకలు


