కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
● రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
● రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు
శంకుస్థాపన
వర్ధన్నపేట: రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో రూ.20 కోట్ల నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పేదల శ్రేయస్సు కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గడిచిన రెండేళ్లలో పట్టణ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆస్పత్రి, తదితర పనులకు రూ.294 కోట్లను ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకుని తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాలా చురుకుగా పనిచేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధుల కేటాయింపునకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోనే 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. కాగా, తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మంత్రి పొంగులేటికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. అభివృద్ధి పనుల పేరిట భూములు కోల్పోతున్నామని, తమకు న్యాయం చేయాలని డీసీ తండాకు చెందిన రైతులు కోరారు. కార్యక్రమాల్లో కలెక్టర్ సత్యశారద, టెస్కాబ్ మాజీ అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయూబ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


