బీజేపీకి ‘అరూరి’ గుడ్‌బై | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి ‘అరూరి’ గుడ్‌బై

Jan 27 2026 9:52 AM | Updated on Jan 27 2026 9:52 AM

బీజేపీకి ‘అరూరి’ గుడ్‌బై

బీజేపీకి ‘అరూరి’ గుడ్‌బై

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

కేసీఆర్‌ ఫోన్‌.. త్వరలో బీఆర్‌ఎస్‌లోకి..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత అరూరి రమేశ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. అనంతరం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరూరి రమేశ్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఆయన వరంగల్‌ నుంచి పార్టీ టికెట్‌ ఆశించారు. అప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి.. తన కూతురు కావ్య వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టడంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం కొద్ది రోజులు ఎటూ తేల్చకపోవడంతో కడియం శ్రీహరి తన కూతురు వైపే మొగ్గు చూపుతున్నారని భావించిన రమేశ్‌ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రమేశ్‌ పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వద్దకు చేర్చారు. కేసీఆర్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ మారొద్దని రమేశ్‌కు హితవు పలికారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనను ఎంపీ టికెట్‌ రేసులో పరిగణనలోకి తీసుకోపోవడంపై రమేశ్‌ మనస్తాపం చెందారు. బీజేపీలో చేరేందుకు వెళ్తున్న రమేశ్‌ కాన్వాయ్‌ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇతర నాయకులు అడ్డగించగా.. ఆ వాహనాలను జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అడ్డుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత రమేశ్‌ బీజేపీలో చేరి వరంగల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన కొద్ది రోజులుగా స్తబ్ధంగా ఉంటున్నారు. ఆదివారం అరూరి తల్లి సంవత్సరీకం జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంతనాలు జరిపినట్లు సమాచారం. అక్కడినుంచే మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలిసింది. ఈమేరకు మంగళవారం బీజేపీ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. కాగా, త్వరలోనే అధిక సంఖ్యలో కార్యకర్తలతో తరలి వెళ్లి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement