లింగగిరి జాతర హుండీ ఆదాయం రూ.2.53లక్షలు
నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర హుండీలను ఆదివారం ఆలయ ఆవరణలో లెక్కించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగురోజుల పాటు జరిగిన జాతరలో హుండీల ద్వారా రూ.1,28,406, దుకాణాల వేలం పాట ద్వారా రూ. 1,24,700, మొత్తం రూ.2,53,107లు వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు శ్రీమాన్ రామాచార్యులు, సర్పంచ్ మేడబోయిన రజిత, ఉపసర్పంచ్ సప్పిడి ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో హౌస్ సిస్టం, స్టూడెంట్ కౌన్సిళ్లు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్ సిస్టం, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఒక్కో స్కూల్‌కు రూ.6,250 చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో స్టూడెంట్ కౌన్సిల్‌కు అవసరమయ్యే బ్లేజర్లు, సాష్‌లు, షూ, బ్యాడ్జీల వంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలోని 188 పాఠశాలలకు రూ.11,75,000, వరంగల్ జిల్లాలోని 197 పాఠశాలలకు రూ.12,31,250, మహబూబాబాద్ జిల్లాలోని 227 పాఠశాలలకు రూ.14,18,750, జనగామ జిల్లాలోని 174 పాఠశాలలకు రూ.10,87,500, ములుగు జిల్లాలోని 90 పాఠశాలలకు రూ.5,62,500, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 125 పాఠశాలలకు రూ.7,81,250 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఆదేశించారని డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ తెలిపారు. ఇప్పటికే ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని, ఈనెల 19 నుంచి మార్చి 12 వరకు ఉదయం పాఠశాలల్లో నిర్దేశించిన సమయానికి ఒకగంట ముందుగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత అదనంగా మరో గంటసేపు తరగతులు నిర్వహించాలని సూచించారు. 42 రోజులపాటు ఏ సబ్జెక్టులు బోధించా లో షెడ్యూల్ కూడా ఇచ్చామని, అందుకు ప్రణా ళికాబద్ధంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ముందుకు సాగాలని కోరారు. టెన్త్ లో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతీ వారం విద్యార్థులకు స్లిప్‌టెస్టులు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారని రాంధన్ తెలిపారు.
లింగగిరి జాతర హుండీ ఆదాయం రూ.2.53లక్షలు


