సర్పంచ్‌లు.. పల్లె ప్రగతి సారథులు
గీసుకొండ/నర్సంపేట : దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు.. సర్పంచ్‌లు వాటి అభివృద్ధి సారథులు. డిసెంబర్ 22న గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి సర్పంచ్‌లకు పాలనపై అవగాహన అవసరం. పాలనపై అవగాహన కల్పించడానికి అధికార యంత్రాంగం శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. గీసుకొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 20 వరకు నాలుగు విడతలుగా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలోని 11 మండలాలకు చెందిన మొత్తం 317 మంది సర్పంచ్‌లు శిక్షణకు హాజరుకానున్నారు.
మొదటి రోజు..
2018 పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పి స్తారు. గ్రామపాలనలో నాయకత్వ పటిమ, ఒత్తిడి ని అధిగమించడం, వివాదాలను పరిష్కరించడం అంశాలపై శిక్షణ ఇస్తారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలపై అవగాహన కలిగిస్తారు.
రెండో రోజు..
గ్రామాభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర, బాధ్యతలు, జీపీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ని రూపొందించడం, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు, పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామపంచాయతీల పాత్ర, గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మించి వాటి వినియోగం గురించి వివరిస్తారు.
మూడో రోజు..
గ్రామపంచాయతీల సమావేశాలు, గ్రామసభల నిర్వహణ, స్టాండింగ్, ఇతర కమిటీల ఏర్పాటు, రికార్డులు, పనుల నిర్వహణ, ఉపాధి పనులు, సో షల్ ఆడిట్, వనమహోత్సవం, ఇళ్లు, లేఔట్ ప్లాట్లకు అనుమతుల విషయాలపై శిక్షణ ఇస్తారు.
నాలుగో రోజు..
గ్రామాల అభివృద్ధి (ఎస్‌ఎల్‌డీజీస్) లక్ష్యాలను నిర్దేశించడం. 9 జాతీయ అవార్డుల (ఎన్‌పీఏ) సాధన కోసం చేయాల్సిన కృషి, సంబంధిత శాఖలతో సమన్వయం, పంచాయతీల ఆదాయ, వ్యయాల నిర్వహణ, ఆడిట్ నివేదికల తయారీ, తాగునీరు, వీధి లైట్ల నిర్వహణపై శిక్షణ ఉంటుంది.
ఐదో రోజు..
రెగ్యులేటరీ విధానాలు, ఈ–పంచాయత్ దరఖాస్తులు, జనన, మరణాల నమోదుపై అవగాహన కలి గిస్తారు. ప్రతీ రోజు సర్పంచ్‌లతో విషయ పరిజ్ఞానంపై చర్చలు, వారి సందేహాలను తీర్చడానికి అధికారులు గ్రూప్ డిస్కషన్ పెడతారు.
శిక్షణ షెడ్యూల్ ఇలా..
మొదటి విడత ఈనెల 19 నుంచి 23 వరకు గీసుకొండ, సంగెం, చెన్నారావుపేట మండలాల సర్పంచ్‌లకు శిక్షణకు ఇస్తారు. రెండో విడత ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పర్వతగిరి, నల్లబెల్లి, నర్సంపేట, మూడో విడత ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు రాయపర్తి, దుగ్గొండి, నాలుగో విడత ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నెక్కొండ, వర్ధన్నపేట, ఖానాపురం మండలాల సర్పంచ్‌లు శిక్షణకు హాజరుకావాలి. వచ్చే ముందు తమ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌తో లింక్ అయిన సెల్‌ఫోన్‌ను తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలని అధికారులు సూచించారు. భోజన వసతిని కల్పించారు.
శిక్షణ ఇచ్చేవారు వీరే..
హైదరాబాద్‌లోని టీజీఐఆర్‌డీ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) కార్యాలయంలో ఇటీవల సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వడానికి పలువురు అధికారులు ట్రైనింగ్ తీసుకుని వచ్చారు. ఎంపీఓలు కూచన ప్రకాశ్, పాక శ్రీనివాస్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, వనపర్తి కరుణాకర్, సెర్ప్ సీసీ బొజ్జ సురేశ్, పంచాయతీ కార్యదర్శి కె.రమ్యకుమారి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, క్లస్టర్ ఆపరేటర్ వేల్పుల సురేశ్‌యాదవ్ సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తారు.
గ్రామాల అభివృద్ధిలో వారే కీలకం
అధికారాలు, విధులు, బాధ్యతలు
తెలుసుకోవాల్సిందే
నేటి నుంచి జిల్లాలోని సర్పంచ్‌లకు శిక్షణ
గంగదేవిపల్లిలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
సామాజిక బాధ్యత..
సర్పంచ్ పదవి రాజకీయ హోదా కాదు, అదొక సామాజిక బాధ్యతగా గుర్తించాలి. చట్టంపై అవగాహన, ప్రణాళిక బద్దమైన పనితీరు, నిధుల సద్వినియోగం ద్వారా నూతన సర్పంచ్‌లు తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. శిక్షణలో నేర్చుకునే పాఠాలను ఆచరణలో పెట్టి, ఆదర్శవంతమైన పల్లెల నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
– కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి
సర్పంచ్‌లు.. పల్లె ప్రగతి సారథులు


