చీఫ్ సెక్రటరీని కలిసిన కమిషనర్
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదివారం గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మేడారంలో కేబినెట్ సమావేశానికి హాజరయ్యే క్రమంలో భాగంగా ఆయన హనుమకొండ ఎన్‌ఐటీ గెస్ట్ హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈనేపథ్యంలో కమిషనర్ ఆయనను కలిసి పూలమొక్క అందజేశారు.
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారుల సమక్షంలో రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత సిబ్బందికి జారీ చేయనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్ సెల్ చక్కటి వేదిక అని, సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
ఖిలా వరంగల్: వార్షిక తనిఖీలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ స్టేషన్‌ను ఆదివారం రైల్వే ఎస్పీ జి.చందన దీప్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె జీఆర్పీ స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టిక, పెండింగ్ కేసుల వివరాలను ఇన్‌స్పెక్టర్ పి.సురేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఎస్పీ చందన దీప్తికి ఇన్‌స్పెక్టర్ సురేందర్ పుష్పగుచ్ఛం, పూలమొక్క అందించి ఘన స్వాగతం పలికారు. ఆతర్వాత పోలీస్ సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. పెండింగ్ కేసులను ఛేదించిన తీరు తెలుసుకుని ఆమె సంతృప్తి చెందారు.
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఆదేశించారని డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ తెలిపారు. ఇప్పటికే ప్రతీ రోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని, ఈనెల 19 నుంచి మార్చి 12 వరకు ఉదయం పాఠశాలల్లో నిర్దేశించిన సమయానికి ఒకగంట ముందుగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, సాయంత్రం పాఠశాల సమయం ముగిసిన తర్వాత అదనంగా మరో గంటసేపు తరగతులు నిర్వహించాలని సూచించారు. 42 రోజులపాటు ఏ సబ్జెక్టులు బోధించాలో షెడ్యూల్ కూడా ఇచ్చామని, అందుకు ప్రణాళికాబద్ధంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ముందుకు సాగాలని కోరారు. టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతీ వారం విద్యార్థులకు స్లిప్‌టెస్టులు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారని రాంధన్ తెలిపారు.
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్ సిస్టం, స్టూడెంట్ కౌన్సిళ్ల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఒక్కో స్కూల్‌కు రూ.6,250 చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో స్టూడెంట్ కౌన్సిల్‌కు అవసరమయ్యే బ్ల్లెజర్లు, షూ, బ్యాడ్జీ ల వంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలోని 188 పాఠశాలలకు రూ.11,75,000, వరంగల్ జిల్లాలోని 197 పాఠశాలలకు రూ.12,31,250, మహబూబాబాద్ జిల్లాలోని 227 పాఠశాలలకు రూ.14,18,750, జనగామ జిల్లాలోని 174 పాఠశాలలకు రూ.10,87,500, ములుగు జిల్లాలోని 90 పాఠశాలలకు రూ.5,62,500, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 125 పాఠశాలలకు రూ.7,81,250 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
చీఫ్ సెక్రటరీని కలిసిన కమిషనర్
చీఫ్ సెక్రటరీని కలిసిన కమిషనర్


