ఇక పురపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల సవరణ ఓ కొలిక్కి వచ్చింది. వార్డుల వారీగా సోమవారం ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వెలువడనుంది. ఈనేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్‌లో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ పోరు ప్రతిష్టాత్మకం కాగా.. ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి సమీకరణలు ప్రారంభించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు తమ సత్తా చాటేలా సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 14న ఎన్నికలు ఉంటాయని, ఈ నెల 20న నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారం ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలకు మున్సిపల్ ఎన్నికలు ఒక రకంగా ‘అగ్నిపరీక్ష’ అనే చెప్పవచ్చు. ఈనేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ముందస్తు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన మరుసటి రోజునే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లో అంతర్గత సమావేశాలకు శ్రీకారం చుట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సైతం ఇదే తరహాలో ముఖ్యనేతలు పర్యటిస్తూ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తూ మంతనాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 30కి పైగా స్థానాలు గెలిచిన బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఇటీవల పర్యటించారు. వామపక్షపార్టీలు సైతం ఎన్నికలకు ఏ తరహాలో ముందడుగు వేయాలనే విషయమై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఆశావహుల్లో టెన్షన్
మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల దృష్టి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లపై పడింది. పాత 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన 3 కలిపి 12 చోట్ల ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రిజర్వేషన్లపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఏ మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవి ఏ సామాజిక వర్గాన్ని వరిస్తుందో.. వార్డుల్లో తమకు రిజర్వేషన్ కలిసి వస్తుందో.. రాదోనన్న అనుమానాలు ఆశావహులను వెంటాడుతున్నాయి. రిజర్వేషన్ల తంతు పూర్తయితే అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టొచ్చన్న భావన ఆశావహుల్లో నెలకొంది. కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇంకా రిజర్వేషన్లను తేల్చలేదు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు సవరణతో పాటే వార్డుల వారీగా కులగణన చేపట్టింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకు రాష్ట్రం యూనిట్‌గా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 మున్సిపాలిటీల వార్డులు, చైర్మన్ పీఠాలకు జనవరి 5న రిజర్వేషన్లు వెల్ల డించింది. ఈసారి 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికారులు కసరత్తు చేస్తుండగా, 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను అధికారికంగా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై మరికొంత సమయం తీసుకుంటారా? లేదా వెంటనే కులగణన ఆధారంగా వార్డులు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ప్రకటిస్తారా?
అన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది.
గెలుపే లక్ష్యంగా..
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అధికారికంగా వెలువడే సమయానికల్లా సర్వసన్నద్ధం కావాలని ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి.. అవసరమైన జోరుని చూపించాలని బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. ప్రస్తుతం వార్డుల విభజన పూర్తవడంతో నాయకులు ఇక ఓటర్ల మీద దృష్టి పెడుతున్నారు. కొత్త ఓటర్లను చేర్పించే విషయంలో పార్టీ శ్రేణులకు ఇదివరకే తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో తుది ఓటరు జాబితా వెలువడిన తర్వాత కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారాన్ని నిర్వహించే వ్యూహాల రచనలో నిమగ్నమయ్యారు. వరుస విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా మార్చుకుని.. ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించి ఓట్లు పొందాలన్న ప్లాన్‌తో బీఆర్‌ఎస్, బీజేపీలున్నాయి. ఈక్రమంలో గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే పనిలో అన్నీ పార్టీలు ఎక్సర్‌సైజు చేస్తున్నాయి.
కొత్త మున్సిపాలిటీలు
స్టేషన్‌ఘన్‌పూర్ కేసముద్రం ములుగు
మున్సిపాలిటీ రిజర్వేషన్
పరకాల ఎస్సీ మహిళ
నర్సంపేట బీసీ మహిళ
వర్ధన్నపేట ఎస్టీ మహిళ
జనగామ జనరల్ మహిళ
మహబూబాబాద్ జనరల్ అన్‌రిజర్వుడ్
డోర్నకల్ ఎస్టీ ఆన్‌రిజర్వుడ్
మరిపెడ ఎస్టీ మహిళ
తొర్రూరు ఎస్సీ అన్‌రిజర్వుడ్
భూపాలపల్లి ఎస్సీ మహిళ
రిజర్వేషన్లు తేలకముందే
ఆశావహుల బాహాబాహీ
పార్టీలకు ప్రతిష్టాత్మకంగా
మున్సిపల్ ఎన్నికలు
12 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల కోసం కసరత్తు
నేడు వార్డుల వారీగా ఫొటోలతో
ఓటర్ల జాబితా
మున్సిపాలిటీ, వార్డులు, రిజర్వేషన్లు
మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ అన్
(జ) రిజర్వ్‌డ్
పరకాల 22 01 05 05 07 04
నర్సంపేట 24 01 03 08 07 05
వర్ధన్నపేట 12 03 02 01 04 02
జనగామ 30 01 05 09 09 06
స్టేషన్‌ఘన్‌పూర్ – – – – – –
మహబూబాబాద్ 36 07 05 06 10 08
డోర్నకల్ 15 04 03 00 04 04
మరిపెడ 15 06 01 00 04 04
తొర్రూరు 16 02 03 03 05 03
కేసముద్రం – – – – – –
జె.ఎస్.భూపాలపల్లి 30 02 06 07 08 07
ములుగు – – – – – –


