నిరుపయోగం
● సమస్యల మధ్య సమావేశాలు ఎలా?
● మూడేళ్లుగా నిలిచిన నిధులు
● ఏఓలపై నిధుల భారం
● జిల్లాలో 59 రైతు వేదికలు
రైతు
వేదికలు
నర్సంపేట: పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. నిధుల లేమితో నిర్వహణ భారంగా మారింది. నాలుగేళ్ల క్రితం నిధులు మెయింటెనెన్స్ కింద అందించారు. నాటి నుంచి మళ్లీ ఇవ్వకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించాలంటే ఇబ్బంది కరంగా మారాయి. మొదట్లో నెలకు రూ.3 వేలు అందించినప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి రూ.9 వేలుగా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కాగితాలకే పరిమితమైంది. దీంతో రైతులకు, అధికారులకు అసౌకర్యంగా మారాయి.
రూ.22లక్షల వ్యయంతో..
గత ప్రభుత్వ హయాంలో మంచి లక్ష్యంతో ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించారు. రైతులంతా ఒకే చోట చేరి సాగుపై చర్చించేందుకు వ్యవసాయానికి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తూ తగు సలహాలు సూచనలు చేసుకునేందుకు రైతు వేదికలను నిర్మించారు. ఐదు నుంచి ఎనిమిది గ్రామాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని జిల్లాలో 59 భవనాలను నిర్మించారు. ఏఈఓను నియమించి దీని నిర్వహణ అప్పగించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ సాగుపై అవగాహన కల్పించే వెసులుబాటును కల్పించారు.
నిర్వహణ కరువు..
మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. సమావేశాలు జరిగే సమయంలో శుభ్రం చేయించుకోవడం ఏఈఓలకు ఇబ్బందిగా మారింది. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలకు నీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. కిటికీలు, ఫ్యాన్లు, మైకులు కొన్ని చోట్ల మాయమై పోయాయి. నిధులు లేకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. భూసార పరీక్షల పరికరాలు, రసాయనాల సరఫరా నిలిచిపోవడంతో మట్టి నమూనాల సేకరణ జరగడం లేదు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో నిధులు ఇచ్చి వసతి సమకూరిస్తే ఉపయోకరంగా ఉంటుందని పలువురు రైతులు కోరుతున్నారు.
నిధులు అందితేనే మెరుగైన సేవలు..
రైతు వేదికలకు గత ప్రభుత్వ హయాంలో నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరుగుతున్నప్పటికీ నిర్వహణ కోసం నిధులు అందితే మెరుగైన వసతులు అందుతాయి.
–దామోదర్‌రెడ్డి, ఏడీఏ
నిరుపయోగం
నిరుపయోగం


