వరంగల్
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్‌లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్‌అండ్‌బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.
18న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం
అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
వరంగల్


