
భూ భారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించండి
దామెర: భూ భారతి దరఖాస్తుల్ని వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించేందుకు అనువైనవి, పరిష్కరించడానికి వీలుకాని దరఖాస్తులపై ఆరాతీశారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్క నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపా రు. నిబంధనలకు అనుగుణంగా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. అనంతరం మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని ఎస్‌బీఐటీలోని మైనార్టీ, సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతి బా పూలే గురుకుల పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, వంట గదులు, డైనింగ్ హాళ్లు, వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రతిజ్ఙ నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఆర్‌ఐ భాస్కర్ రెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేశ్‌లాల్ షట్కర్, యాదగిరి, సమ్మయ్య, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి