అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు గురువారం నుంచి వారాబందీ విధానంలో సాగునీరు సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు అధికారికంగా వెల్లడించారు. కుడి, ఎడమ కాల్వలకు వరుసగా ఐదురోజుల పాటు సాగునీరు సరఫరా చేస్తూ.. మరో 5 రోజుల పాటు నిరంతరాయంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. మొదటిసారిగా వానాకాలంలో వారాబందీ విధానంలో సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో కుడి, ఎడమ కాల్వల కింద 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవక జలాశయానికి ఆశించిన మేర వరద చేరలేదు. దీంతో ఆయకట్టులో వరి సాగుచేస్తే నీరు ఇవ్వలేమని.. కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని ఇరిగేషన్ అధికారులు ముందునుంచే గ్రామాల్లో టాంటాం వేయించారు. అయినా ఆయకట్టు రైతులు మాత్రం కళ్ల ఎదుట కాల్వల్లో సాగునీరు పారుతుండటంతో వరి సాగు చేశారు. ప్రస్తుతం జలాశయంలో 5.908 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో వచ్చే రెండునెలల పాటు వారాబందీ విధానంలో నీటి సరఫరాకు ముందుకొచ్చారు. వారాబందీ విధానంలో ఎప్పుడెప్పుడు సాగునీరు అందిస్తామనే విషయాలను ఆయకట్టు గ్రామాల్లో రైతులకు వివరించాలని కాల్వవెంట విధులు నిర్వహిస్తున్న లష్కర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏఈలు, డీఈలు సైతం వారాబందీపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గురువారం వెలువడిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రధాన ఎడమ కాల్వలో
పారుతున్న వరద
నేటి నుంచి నిలిపివేత..
వారాబందీ విధానం అమలులోకి రావడంతో జూరాల కుడి, ఎడమ కాల్వలకు శుక్రవారం నుంచి సాగునీటి సరఫరాను నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, విద్యుదుత్పత్తి కేంద్రాలకు గురువారం సాయంత్రమే నీటి సరఫరాను నిలిపివేశారు. వీటితోపాటు సమాంతర కాల్వలో సైతం లీకేజీ నీరు పారకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
అధికారికంగా ప్రకటించిన అధికారులు
గురువారం నుంచే అమలులోకి..
5 రోజుల పాటు సాగునీటి సరఫరా.. మరో 5 రోజులు నిలిపివేత
జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతలకు వర్తింపు
రైతు ప్రయోజనాల కోసమే..
జూరాల ఆయకట్టులో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో వారాబందీ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు కాల్వలకు వరుసగా 5 రోజుల పాటు నీటిని వదిలి తర్వాత 5 రోజులు నిలిపివేస్తాం. ఈ విషయాన్ని రైతులు గుర్తించి పొదుపుగా వినియోగించుకోవాలి. – చంద్రశేఖర్,
ఈఈ, జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డివిజన్


