వనపర్తి రూరల్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలంటూ వామపక్షాల ఽఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి రాజీవ్‌చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో కీలుబొమ్మగా మారి దేశంలో ఎన్నికల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి తొత్తుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సుమారు 13.5 కోట్ల ఓట్లను ఎన్నికల సంఘం ద్వారా తొలగించారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి చిన్నా, పెద్ద సమస్యలన్నింటిని పక్కనబెట్టి అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, కళాకారులు, మేధావులు పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. సీఈసీ రాజీనామా చేయకపోతే ఉద్యమం ఇక్కడితో ఆగదని.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే స్థాయికి చేరుతుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, నాయకులు ఎండీ జబ్బార్, ఎం.రాజు, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.


