వనపర్తి: సృష్టికి మూలం తల్లిదండ్రులేనని.. వృద్ధాప్యంలో వారిని బాధ పెట్టకుండా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మధ్య కొందరు వయోవృద్ధులు తమ సంతానానికి తాము సంపాదించిన ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినా.. సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం లేదని ఆర్డీఓ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 169 ఫిర్యాదులు రాగా.. వాటిలో 115 పరిష్కరించినట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా తమ పిల్లలు సంరక్షణ బాధ్యతలు తీసుకోకుంటే తల్లిదండ్రులు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మనిషికి కొంత వయస్సు వచ్చాక వృద్ధాప్యం ప్రారంభమై కండరాలు కరిగిపోవడం ప్రారంభమవుతాయని.. కచ్చితంగా వ్యాయామం, యోగా చేస్తూ పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రిలో స్పెషల్‌సెల్ ఏర్పాటుచేసి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలో వయోవృద్ధుల కోసి రీ–క్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని.. అది పట్టణానికి కాస్త బయట ఉన్నందున వయోవృద్ధులు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదని, త్వరలో పట్టణంలోకి మార్చాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. అనంతరం డీఎస్పీ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు తమ పిల్లల నుంచి సమస్యలు వస్తే టోల్ ఫ్రీ నంబర్ 14567 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. పింఛన్ కోసం ఓటీపీలు అడిగి ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీ చేస్తున్నారని, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధులను కలెక్టర్ శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, సెర్ఫ్ ప్రోగ్రాం అధికారి లింగయ్యగౌడ్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బి.ఇందిరా, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యుడు నాగేంద్రస్వామి, అమ్మ స్వచ్ఛంద సంస్థ నుంచి చిన్నమ్మ థామస్ పాల్గొన్నారు.


