సమ్మెకు సై.. | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు సై..

Apr 22 2026 7:42 AM | Updated on Apr 22 2026 7:42 AM

నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్‌

డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట

రీజియన్‌లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు

అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు

ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు

● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.

● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి.

● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి.

● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

● ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.

● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి.

● ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి.

● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి.

● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి.

● రిటైర్డ్‌ అయిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లించాలి.

● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.

డిపో బస్సులు

అచ్చంపేట 80

గద్వాల 108

కల్వకుర్తి 103

కొల్లాపూర్‌ 65

కోస్గి 27

మహబూబ్‌నగర్‌ 152

నాగర్‌కర్నూల్‌ 81

నారాయణపేట 97

షాద్‌నగర్‌ 91

వనపర్తి 121

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్‌ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్‌ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు.

925 బస్సులు.. 3267 మంది కార్మికులు

మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్‌ డ్రైవర్లు, 148 మంది ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లు, 385 మంది మెకానిక్‌ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్‌ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు..

సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం.

– సంతోష్‌కుమార్‌,

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement