● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్‌కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్‌లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్‌కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్‌లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


