కొత్తకోట రూరల్: హిందూ సమాజ ఐక్యత, దేశ సమగ్రతకు రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపించబడిందని అంబత్రయ క్షేత్రం వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని అమడబాకులలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఐక్యతను కాపాడటం, హిందూ ధర్మ పరిరక్షణకు ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదంతో దేశభక్తిని పెంపొందిస్తూ సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి హిందువు తన ధర్మ సూత్రాలను పాటిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని.. మతమార్పిడి వంటి చర్యలతో సమాజంలో విభేదాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని, హిందువులు ఐక్యంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంపర్క్ ప్రముఖ్ గుర్రం సంజీవ, సర్పంచ్ గాయత్రి, ఖండ సంఘచాలక్ మురళీధర్, నిర్వాహకులు సురేంద్రనాథ్, ప్రకాష్, శ్రీనివాసులు, జ్ఞానేశ్వర్, పవన్, అమరేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


