వనపర్తి రూరల్: గర్భిణులు, బాలింతలు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ సుధారాణి అన్నారు. మంగళవారం మండలంలోని చిట్యాల రైతువేదికలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించగా.. ఆమెతో పాటు సీడీపీఓ హజీరాబేగం, సర్పంచ్ జి.శోభ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పోషక విలువలు, బాలింతలు, గర్భిణులు, నవజాత శిశుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. సీడీపీఓ హజీరాబేగం మాట్లాడుతూ.. రోజు తీసుకునే ఆహారంలో పోషక విలువలున్న ఆకు, కాయగూరలు, పండ్లు, గుడ్లు, పాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని.. అందులో భాగంగానే పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాంబాబు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు బాలీశ్వరి, రాణి, సంహిత, భారతి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది పాల్గొన్నారు.


