ఖిల్లాఘనపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జెడ్పీ సీఈఓ యాదయ్య విద్యార్థులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఎంపీడీఓ సునీత, ఎంపీఓ నర్సింహయ్యతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని ఉపాధ్యాయులు ఆయనకు తెలిపారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఆహార పదార్థాలు, బియ్యం, పప్పులు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఖిల్లాఘనపురంలో ఇంగ్లిష్, తెలుగు మీడియం కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయని, ఇంటర్ తరగతులను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒకేషనల్ కోర్సులో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.


