వనపర్తి రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని, తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపారు. సోమవారం పెబ్బేరు మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన చివరి సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయనతో పాటు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి పునాది వంటిదని, సాంకేతిక విద్యలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పుర చైర్మన్ మాట్లాడుతూ.. పుర పరిధిలోని విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల కనీస సౌకర్యాల కల్పనకు తమవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పంపిన క్రీడా కిట్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్ జయచంద్ర, ఎస్‌ఐ దివ్యారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


