ఆత్మకూర్: తెలంగాణ పశువర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ సీఈఓ వాకిటి నరేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక మార్కెట్‌యార్డు, 10.30 గంటలకు మూలమళ్ల, 11 గంటలకు జూరాల, 11.30 గంటలకు దేవరపల్లి, మధ్యాహ్నం 12 గంటలకు తిప్పడంపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వివరించారు.
ప్రశాంతంగా ‘ఆదర్శ’ ప్రవేశ పరీక్ష
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకులలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12 వరకు పరీక్ష నిర్వహించగా 364 మంది విద్యార్థులకుగాను 275 మంది హాజరుకాగా, 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షలో 217 మంది విద్యార్థులకుగాను 159 మంది హాజరుకాగా 58 మంది విద్యార్థులు రాలేదు.
చేనేత ఓటరు జాబితా ప్రదర్శన
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం అమరచింత చేనేత సహకార సంఘంలో ఓటరు జాబితాను ప్రదర్శించారు. సంఘంలో మొత్తం 766 మంది ఓటర్లు ఉన్నట్లు అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్ తెలిపారు. ఓటరు జాబితాను డైరెక్టర్లతో కలిసి నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రదర్శించి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం మరోమారు జాబితాను రూపొందించి ఏడీ కార్యాలయంలో సమర్పిస్తామని వివరించారు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లో ఓటరు జాబితా ప్రదర్శన పూర్తిచేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని చేనేత జౌళిశాఖ ఏడీ పద్మ తెలిపారు. వచ్చే నెల 15 వరకు పూర్తిస్థాయి ఓటరు జాబితా సిద్ధం చేసి పంపనున్నట్లు వివరించారు.


