అప్రమత్తతతో ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో ప్రమాదాల నివారణ

Apr 20 2026 7:18 AM | Updated on Apr 20 2026 7:18 AM

కొత్తకోట రూరల్‌: ప్రజలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని కొత్తకోట అగ్నిమాపక అధికారి దేవేందర్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సినిమా థియేటర్లు, జన సంచార ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పొగ ఎక్కువగా వ్యాపించినప్పుడుడు ప్రజలు నేలకు దగ్గరగా వంగి లేదా మోకాళ్లపై పాకుతూ బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్‌లను వాడకుండా మెట్ల మార్గం వినియోగించాలన్నారు. పొగ నుంచి బయటకు రావాల్సిన సమయంలో ముక్కు, నోరు కప్పుకోవడానికి తడి గుడ్డ లేదా రుమాలు ఉపయోగిస్తే శ్వాస ఇబ్బంది తగ్గుతుందన్నారు. అలాగే సినిమా ప్రదర్శన మధ్యలో ఫైర్‌ అలారం మోగితే వెంటనే బయటకు రావాలని, వ్యక్తిగత వస్తువుల కోసం వెదకకుండా ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. థియేటర్‌ యాజమాన్యం ప్రమాదం సంభవించిన వెంటనే అత్యవసర ద్వారాలను తెరవడం, లైట్లు వెలిగించడం, ప్రేక్షకులు ప్రశాంతంగా బయటకు పంపే విధంగా మార్గదర్శనం చేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, సూచనలు పాటిస్తే అగ్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించవచ్చని వివరించారు.

కరపత్రాలు పంపిణీ..

ఆత్మకూర్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మార్ట్‌లు, ఇతర ప్రాంతాల్లో ఆదివారం సిబ్బంది ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విన్యాసాలతో క్లుప్తంగా వివరించారు. అగ్నిమాపక అధికారి సంజీవరెడ్డి బహుళ అంతస్తుల్లో ప్రజలు ప్రమాదాల బారినపడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. చివరిరోజు సోమవారం ప్రధాన కూడళ్లు, గ్రామాల్లో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది రాముడు, నాగార్జున, వెంకట నర్సింహయ్య, భీమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement