పాన్‌గల్: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో రూ.42.12 లక్షలతో అదనపు మౌలిక వసతులు, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ, రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్రీడా మైదానం తదితర సమస్యలున్నాయని మంత్రికి వివరించారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సర్వేచేసి నివేదిక అందించాలని తహసీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని.. ఆరోగ్యంగా ఉంటేనే చదవడం, ఆటలు ఆడటం సాధ్యమని చెప్పారు. చదువు సమాజాన్ని సంస్కరించేదిగా ఉండాలని.. రోజు విద్యార్థులకు మహనీయుల చరిత్రను వివరిస్తూ వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. బాలికలు పొడువుకు తగిన బరువు ఉండేలా చూడాలని.. అందుకు తగిన ఆహారం అందించాలన్నారు. మూడు నెలల తర్వాత విద్యాలయాన్ని సందర్శించినప్పుడు మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి బలోపేతానికి తోడ్పాటునందించాలని కోరారు.
చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యమే..
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


