తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

వనపర్తిటౌన్‌: వేసవిలో పుర ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు పుర చైర్‌పర్సన్‌ ఎం.మాధవి తెలిపారు. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే బుగ్గపల్లి, కానాయపల్లి పంప్‌హౌస్‌, రామన్‌పాడు సమీపంలో, రాజాపేటలో పగిలిన తాగునీటి పైప్‌లైన్‌ను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామన్‌పాడు రిజర్వాయర్‌ ద్వారా తాగునీరు అందించేందుకు 85 హెచ్‌పీ, 155 హెచ్‌పీ మోటార్లు అవసరమని పుర అధికారులు ఆమె దృష్టికి తీసుకురాగా.. కౌన్సిల్‌ ఆమోదంతో కొనుగోలు చేద్దామని చెప్పారు. తాగునీటి సరఫరా విషయంలో ఇంజనీరింగ్‌ అధికారులు లైన్‌మెన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సరఫరా అయ్యే నీటికి ప్రత్యామ్నాయంగా రామన్‌పాడు సమీపంలో మోటార్ల ఏర్పాటుతో ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తకుండా చూసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. అధికారులు తక్షణం స్పందించాలని సూచించారు. లైన్‌మెన్లు, అధికారులతో పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పుర కమిషనర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, డీఈ యూనూస్‌, ఏఈ, అధికారులు, కౌన్సిలర్లు, లైన్‌మెన్లు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్ర ప్రారంభం..

పుర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చైర్‌పర్సన్‌ ఎం.మాధవి శుక్రవారం ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు మున్సిపాలిటీ తరుఫున కలెక్టరేట్‌, పుర కార్యాలయం, గాంధీచౌక్‌, రాజీవ్‌చౌక్‌లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వెంకటేష్‌, డీఈ యూనూస్‌, మేనేజర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, అధికారులు, కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌ఎల్‌ఎన్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement