వనపర్తిటౌన్: రెండో పీఆర్సీని జూన్ 2లోగా ప్రకటించాలని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు జి.అశోక్‌కుమార్, ప్రధానకార్యదర్శి ఎస్.వరప్రసాద్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ (తెలంగాణ ఉద్యోగులు, గజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక అండ్ పింఛన్ల కార్యాచరణ సమితి) ఆధ్వర్యంలో రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, మేనిఫెస్టోలో ప్రకటించినట్లు సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 61 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల కరువు భత్యం చెల్లించి న్యాయం చేయాలన్నారు. ముఖ్యమైన 64 డిమాండ్లలో కేవలం నాలుగింటినే పరిష్కరించాలని కోరుతున్నామని, స్పందించకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బౌద్ధారెడ్డి, ఎస్.చంద్రశేఖర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్‌గౌడ్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ స్టాఫ్ ప్రధానకార్యదర్శి రషీద్, డీటీఎఫ్ తరఫున మద్దిలేటి, శివారెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీజీహెచ్‌ఎంఏ జిల్లా ప్రధానకార్యదర్శి బాణం విష్ణు, టీఎన్జీఓ జిల్లా ప్రధానకార్యదర్శి రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజనయ్య, నర్సింహులుగౌడ్, కార్యదర్శి జగపతిరావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.


