నిధుల గండం..! | - | Sakshi
Sakshi News home page

నిధుల గండం..!

Apr 17 2026 12:50 PM | Updated on Apr 17 2026 12:50 PM

అవకాశం ఉంది.. హడావుడే తప్ప.. ఆచరణ శూన్యం రెండు, మూడేళ్లుగా మందగమనం..

కేంద్రం నుంచి వచ్చే నిధులపై

నీలినీడలు

గతేడాది వసూలైన ఆస్తిపన్ను రూ.5.72కోట్లు

ఈ సారి రూ.5.53 కోట్లు మాత్రమే..

మరో 12శాతం వసూలుకాక

ఫర్ఫామెన్స్‌ గ్రాంట్లకు గండి

వనపర్తి పురపాలికలో గతేడాదికి మించి వసూలుకాని ఆస్తిపన్ను

వనపర్తిటౌన్‌: కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను వనపర్తి మున్సిపాలిటీ చేజారవిడుచుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మార్చి 29 నాటికి మున్సిపాలిటీలో వసూలుచేసిన ఆస్తిపన్ను కంటే మరో 12శాతం అదనంగా వసూలుచేస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. ఈ మేరకు ప్రభుత్వం ముందస్తుగానే సూచనలు చేసినప్పటికీ మున్సిపల్‌ అధికారులు ఆస్తిపన్ను వసూలులో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 5.72కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన మున్సిపాలిటీలో.. ఈసారి 42.87 శాతంతో రూ. 5.53కోట్ల ఆస్తిపన్ను వసూలయ్యాయి. అదనంగా మరో రూ. 63లక్షలు వసూలైతే కేంద్రం నిధులకు అర్హత సాధించేది. ఆస్తిపన్ను వసూలు లక్ష్యం నెరవేరకపోవడంతో నిధులు రాక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

సవాల్‌గా మారిన నిబంధన..

ఆస్తిపన్ను వసూళ్లలో గతేడాది కంటే రాష్ట్ర జీఎస్‌డీపీ ప్రకారం నిధుల లక్ష్యానికి చేరువైతేనే కేంద్ర ప్రభుత్వం విడుదలచేసే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఇదే నిబంధన ప్రతిసారీ పురపాలిక సంఘాలకు సవాల్‌గా మారుతోంది. చివరి నిమిషంలోనూ దీనికోసం హడావుడి చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం పన్ను వసూళ్లు చేపట్టడం లేదు. వాస్తవానికి నివాసగృహాలు, వాణిజ్య నిర్మాణాలు, పరిశ్రమలు.. ఇలా ఎలాంటి ఆస్తులున్నా ఆరు నెలలకొకసారి పన్ను వసూలు చేస్తారు. అనుకున్న మేరకు సక్రమంగా వసూలుచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు. ప్రతిసారి ఆర్ధిక సంవత్సరం ముగిసే మార్చిలోనే సిబ్బంది ఉరుకులు పరుగులు తీస్తున్నారు. దీంతో పన్నుల లక్ష్యం నెరవేరడం లేదు.

వనపర్తి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో నివాసాలు, దుకాణాలు కోల్పోయిన వాటికి కూడా ఆస్తిపన్ను వస్తుంది. ఆ వివరాలను అదనపు కలెక్టర్‌కు అందించాం. మనుగడలో లేని వాటికి కూడా సుమారు రూ. 1.20కోట్ల పన్ను చూయిస్తుంది. వాటిని ఆన్‌లైన్‌లో పూర్తిగా తొలగిస్తే కేంద్రం నిధులకు అర్హత సాధించవచ్చు.

– శంకర్‌, ఇన్‌చార్జి ఆర్‌ఓ,

వనపర్తి మున్సిపాలిటీ

ఆస్తిపన్ను వసూళ్లకు కమిషనర్‌, ఆర్‌ఓతో మొదలుకొని వార్డు అధికారుల వరకు హడావుడే తప్పితే.. ప్రణాళికాబద్ధంగా ఎక్కడా ముందడుగు వేసినట్లు కనిపించ లేదు. దీనికి తోడు ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది పెడచెవిన పెట్టడంతో ఆస్తిపన్ను లక్ష్యానికి గండిపడింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ తదితరులు ఆస్తిపన్ను వసూలుపై సమీక్షలు జరిపినా పెద్దగ ప్రభావం చూపలేదు.

ఉమ్మడి జిల్లాలోనే పేరున్న వనపర్తి మున్సిపాలిటీలో రెండు, మూడేళ్లుగా ఆస్తిపన్ను వసూళ్లలో మందగమనం చోటుచేసుకుంటుంది. మున్సిపాలిటీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రూ. 20.77 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 5.53 కోట్ల వసూళ్లకే పరిమితమై కేంద్ర నిధులను కోల్పోయింది. మొత్తం లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్నా 50శాతం పన్నులు కూడా వసూలు చేయకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement