సాదాబైనామాకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

సాదాబైనామాకు మోక్షం

Apr 16 2026 12:41 PM | Updated on Apr 16 2026 12:41 PM

ప్రభుత్వ మార్గదర్శకాలతో..

జిల్లాలో 8,120 దరఖాస్తులు పెండింగ్‌

వనపర్తి: సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2020, నవంబర్‌ 10 నుంచి అఫిడవిట్‌ దాఖలు విషయంలో భూమి విక్రయించిన వారితో సైతం తీసుకోవాలని నిబంధనలను సడలించే డిమాండ్‌ ఉండటం, ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో జాప్యం జరిగింది. ఇటీవల భూమి కొనుగోలు చేసిన వారితో మాత్రమే అఫిడవిట్‌ తీసుకుంటే సరిపోతుందనే నిబంధనతో ప్రభుత్వం జీఓ నంబర్‌ 76, 77 జారీ చేయడంతో ఎట్టకేలకు సాదాబైనామా పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం లభించినట్లు అయింది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 8,120 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీఓల ఆధారంగా అధికారులు విచారణకు నోటీసులు జారీ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేలాది మంది రైతుల నిరీక్షణ ఫలించనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన సాదాబైనామా అర్జీల పరిష్కారానికి అప్పటీ జీఓ 112పై వచ్చిన అభ్యంతరాలు, విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. దీంతో కోర్టులో సాదాబైనామాపై ఉన్న పిల్‌ను కొట్టివేసింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అమలులోకి వచ్చిన సాదాబైనామాల అమలు ప్రక్రియ ఆగుతూ.. సాగుతూ.. అన్నట్లుగా ఉంటోంది. 2016లో జీఓనంబర్‌ 153తో కొన్నింటిని అమలు చేశారు. ధరణి చట్టం అమలులోకి వచ్చాక మరో జీఓను నాటి ప్రభుత్వం జారీ చేయడం, ఈ జీఓను సవాల్‌ చేస్తూ కోర్టులో పిల్‌ దాఖలు కావడంతో ప్రక్రియకు బ్రేక్‌ పడినట్‌లైంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కోర్టుకు కావాల్సిన వివరాలను సమర్పించడంతో దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. జిల్లాలో 2020, నవంబర్‌కు ముందే కొన్ని దరఖాస్తులను పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. మిగిలిన వాటిని పరిష్కరించేందుకు అధికారులు కొత్త జీఓలతో సమాయత్తమవుతున్నారు.

మండలం పెండింగ్‌

దరఖాస్తులు

పెబ్బేరు 1,788

పాన్‌గల్‌ 919

వీపనగండ్ల 822

వనపర్తి 707

ఏదుల 618

గోపాల్‌పేట 575

కొత్తకోట 480

చిన్నంబావి 448

శ్రీరంగాపురం 387

పెద్దమందడి 354

ఆత్మకూర్‌ 257

రేవల్లి 252

ఖిల్లాఘనపురం 225

మదనాపురం 172

అమరచింత 86

ప్రభుత్వం మార్గదర్శకాలతో

పరిష్కార మార్గం

ఏళ్ల నిరీక్షణకు తెర

భూమి విక్రయించిన వారి

అఫిడవిట్‌ అక్కర్లేదని జీఓ జారీతో వీడిన చిక్కుముడి

Advertisement
 
Advertisement
Advertisement