ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
వనపర్తి: జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్‌లిస్టింగ్ బ్లాక్‌ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, హెచ్‌ఎల్‌బీ డీమార్కేషన్ పనులను గురువారంలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి జనగణనలో భాగమైన హౌస్ లిస్టింగ్ బ్లాక్ ఏర్పాటు ప్రక్రియపై తహసీల్దార్లు, పుర కమిషనర్లు, ఎంపీఎస్‌ఓలతో టెలీ కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అధికారులు నిర్దేశిత గడువులోగా డీమార్కేషన్ పూర్తి చేయాలని, హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్‌కు సంబంధించిన ప్రింట్ కాపీలను ఎన్యూమరేటర్లకు అందజేయాల్సి ఉంటుందన్నారు. పనులు సమర్థవంతంగా, సమయపాలనతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సీపీఓ హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గోపాల్‌పేట: జిల్లాలో జరుగుతున్న అబార్షన్ కేసుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి కేసు వెనక ఉన్న కారణాలు, చోటుచేసుకునే ప్రాంతాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసవాల రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి జరుగుతున్న ప్రసవాలు, అబార్షన్‌లపై ఆరా తీశారు. అబార్షన్లకు కారణాలు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్న వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్యసేవల కోసం అవసరమైన సదుపాయాలతో నివేదిక సమర్పించాలన్నారు. మహిళలకు హెపీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని, ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలని సూచించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
అనంతరం మండలంలోని పొలికెపాడులో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 35 ఇళ్లు మంజూరకాగా.. 34 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందని, మూడు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. అర్హులైన వారికి రెండోవిడతలో తప్పనిసరిగా మంజూరవుతాయని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ ఇంటిని హౌసింగ్ కార్యాలయానికి వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై జనగణనపై సమీక్షించారు. గురువారం వరకు హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, డీ–మార్కేషన్ పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు. 18 నుంచి ఆయా బృందాలకు శిక్షణ ఉంటుందని.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ విఠోబా, సీపీఓ హరికృష్ణ, వైద్య అధికారులు ఉన్నారు.


