పేదల హక్కుల సాధనకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

పేదల హక్కుల సాధనకు పోరాటం

Apr 16 2026 12:41 PM | Updated on Apr 16 2026 12:41 PM

ఖిల్లాఘనపురం: దేశంలో పేదలు ఉన్నంత కాలం వారి హక్కులు, దోపిడీ వ్యవస్థ నిర్మూలన, పేదల జీవన పరిస్థితులు మెరుగుపర్చడానికి ఎర్ర జెండా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. మండల కేంద్రంలోని ఓ సంఘం కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలకు ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు జిల్లా సీనియర్‌ నాయకుడు వేణుగోపాల్‌, మహాసభ అధ్యక్షుడు ఎస్‌.అజయ్‌, భూ పోరాటాల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ సక్రూనాయక్‌, ఉపాధి కూలీల సంఘం నాయకులు లక్ష్మి హాజరుకాగా వారితో కలిసి సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకొచ్చిందని, అందులోని నిబంధనలు వ్యవసాయ కూలీల కడుపుకొట్టే విధంగా ఉన్నాయని చెప్పారు. శ్రమకు తగిన వేతనం లేనందున కొత్త చట్టాన్ని రద్దు చేసి పాతది కొనసాగించాలని కోరారు. సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కూలీల కడుపుకొట్టి పెద్దల కడుపులు నింపే విధంగా ఉన్నాయని ఆరోపించారు. సమగ్ర కూలీ చట్టం తీసుకురాకుండా కూలీల బతుకుల్లో మార్పు తెస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. మండలంలోని కర్నెతండాలో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. భవిష్యత్‌లో కూలీలు, భూ పోరాటాలకై వ్యవసాయ కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బాల్యానాయక్‌, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు రామచంద్రయ్యగౌడ్‌, జీఎంపీఎస్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ బాలపీరు, మండల నాయకులు పొయ్యికాటి పెంటయ్య, వ్యవసాయ సంఘం నాయకులు ఆర్‌.మౌలాలి, మహబూబ్‌పాషా, నిరంజన్‌, వెంకటయ్య, ముత్యా లు, దేవన్న, సత్యనారాయణ, భరత్‌, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement