కొత్తకోట రూరల్: వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారి దేవేందర్ సూచించారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కొత్తకోట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుదాఘాతాలు, నిర్లక్ష్యంగా గ్యాస్ వినియోగం, చెత్త దహనం వంటి కారణాలతో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. గ్యాస్ సిలిండర్లు సురక్షితంగా వినియోగించడం, విద్యుత్ పరికరాలను సరిగా నిర్వహించడం, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే స్పందించి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో అగ్ని ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


