అంబేడ్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకం

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

వనపర్తి: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని.. అందరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి.చిన్నారెడ్డితో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, శాట్‌ చైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే అంటరానితనం, అస్ప్రశ్యతను దూరం చేయవచ్చని అంబ్కేడర్‌ నమ్మారన్నారు. ఆ రోజుల్లోనే ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివిన ఘనత సాధించారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రిగా పని చేశారని, ఆయన రూపొందించిన రాజ్యాంగం దేశంలో అమలవుతోందని తెలిపారు. ఆయన కృషి ఫలితమే నేడు సమాజంలో సమానత్వం విరాజిల్లుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని.. రెసిడెన్షియల్‌, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు, ఉన్నత విద్యాలయాలు నెలకొల్పుతోందని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించాలని.. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని గుర్తు చేశారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ జీవితం సమాజానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడమే కాకుండా సమాజానికి సేవ చేయడం కూడా ముఖ్యమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఉన్నత విద్యతో ఏదైనా సాధించగలరని తెలిపారు. ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇంటి మొత్తానికి జ్ఞానాన్ని పంచుతుందని.. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే జ్ఞానం లభిస్తుందని, అంబేడ్కర్‌ సిద్ధాంతాలను అనుసరిస్తూ బాగా చదువుకోవాలని సూచించారు. ఆయన జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆయన ఘనతను చాటి చెప్పాలన్నారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు అంబేడ్కర్‌ జీవితంపై పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, పుర వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం నాగరాజు, ఉపాధ్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement